కోఠి–కొండాపూర్ 127 బస్సు కోసం ప్రయాణికుల పడిగాపులు!
బస్సు కోసం గంటల తరబడి నిరీక్షణ.. పట్టించుకునే నాధుడే కరువు!
హైదరాబాద్: కోఠి నుంచి కొండాపూర్‌కు వెళ్లే 127 నంబర్ బస్సు ప్రయాణికులకు నిత్యం నరకప్రాయంగా మారుతోంది. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. వచ్చినా ఎక్కే పరిస్థితి ఉండదు! గంటల తరబడి బస్టాప్‌ల వద్ద నిలబడి ఎదురుచూస్తున్న ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. అయినా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఉదయం ఉద్యోగాలకు వెళ్లే సమయం, సాయంత్రం ఇంటికి చేరుకునే వేళ ప్రయాణికుల అవస్థలు మరింత దారుణంగా ఉంటున్నాయి. బస్సు కోసం నిరీక్షిస్తూ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ఆలస్యంగా బస్సు రావడంతో ఉద్యోగులకు ఆఫీసులకు చేరుకోవడంలో ఇబ్బందులు, విద్యార్థులకు తరగతులు మిస్ అయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు పడుతున్న బాధలు చెప్పనలవి కావు. బస్సు వచ్చిందంటే చాలు.. ఎక్కేందుకు ప్రయాణికుల మధ్య తోపులాట తప్పడం లేదు. ఇప్పటికే కిక్కిరిసిన బస్సులోకి ఎలాగోలా ఎక్కినా నిలబడేందుకు కూడా చోటు దొరకడం లేదు. ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణికులు అలసటకు గురవుతున్నారు. బస్సు కోసం ఎదురుచూడాలా? వచ్చిన బస్సులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలా? అన్నది 127 రూట్ ప్రయాణికుల ముందున్న ప్రశ్న.ప్రజా రవాణాను మెరుగుపరచాల్సిన అధికారులు ప్రయాణికుల గోడును ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపడం, రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు ఏర్పాటు చేయడం, బస్సుల రాకపోకలకు నిర్దిష్ట సమయాలను పాటించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రయాణికుల ప్రశ్న ఒక్కటే.. కోఠి–కొండాపూర్ 127 బస్సు కోసం ఇంకెన్నాళ్లు ఈ పడిగాపులు?
ప్రజల రోజువారీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చాల్సిన ఆర్టీసీ, కనీసం బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల బాధలను అయినా గుర్తించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి 127 రూట్లో బస్సుల సంఖ్య పెంచి, ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.