స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ డీఎస్‌సీ ఏ21 నౌకాదళానికి అప్పగింత
సూర్య జాతీయ డెస్క్: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో స్వదేశీ నౌక చేరింది. డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డీఎస్‌సీ ఏ21 నౌకను ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో నౌకాదళం శుక్రవారం అందుకుంది. కోల్‌కతాకు చెందిన టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ఈ నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించింది. నీటి అడుగున చేపట్టే వివిధ ఆపరేషన్లకు తోడ్పడేలా అత్యాధునిక డైవింగ్ పరికరాలు, ప్రత్యేక వ్యవస్థలతో ఈ నౌకను తీర్చిదిద్దారు.
క్యాటమరన్ హల్ డిజైన్‌తో రూపొందించిన డీఎస్‌సీ ఏ21 నౌక సముద్రంలో మెరుగైన స్థిరత్వాన్ని, విశాలమైన డెక్ ప్రాంతాన్ని కలిగి ఉండటంతో పాటు క్లిష్టమైన సముద్ర పరిస్థితులను సులువుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దబడింది. ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ నౌకాదళ నిబంధనలకు అనుగుణంగా దీని నిర్మాణం జరిగింది. డిజైన్ దశలో విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ హైడ్రోడైనమిక్ విశ్లేషణ మరియు మోడల్ పరీక్షలను నిర్వహించింది.
ఈ ప్రాజెక్టు కింద నౌకల చేరికతో డైవింగ్ సపోర్ట్, నీటి అడుగున తనిఖీలు, సహాయక చర్యలు మరియు తీర ప్రాంత కార్యాచరణ సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఈ నౌక నిదర్శనంగా నిలుస్తోందని, ప్రత్యేక నౌకాదళ వేదికల రూపకల్పన మరియు నిర్మాణంలో దేశీయ పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఇది స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.