లక్నో, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లలో పాఠశాలలు మూసివేత!
సూర్య జాతీయ డెస్క్: ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో శనివారం పాఠశాలలను మూసివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
లక్నో జిల్లాలో శనివారం (సెప్టెంబర్ 26) 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రయాగ్‌రాజ్ జిల్లాలో వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేయడం మరియు నిరంతరంగా వర్షం కురుస్తుండటంతో ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు బడులకు సెలవు ప్రకటించారు. కాన్పూర్ జిల్లాలో కూడా వర్ష తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేశారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సమీక్షించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాలు, పిడుగుపాటు వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి మరియు పశు నష్టాలను స్వయంగా పర్యవేక్షించి, బాధితులకు 24 గంటల్లోగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు.