కేరళ తీరానికి 'కళ్లక్కడల్' ముప్పు.. ఇన్‌కోయిస్ 'రెడ్ అలర్ట్' జారీ!
సూర్య జాతీయ డెస్క్: కేరళ తీరప్రాంతాన్ని తీవ్ర సముద్ర అలల ముప్పు చుట్టుముట్టింది. తీరంలో రాకాసి అలలు ఎగసిపడే 'కళ్లక్కడల్' (Kallakkadal) పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్' (INCOIS) శనివారం రాష్ట్ర తీరప్రాంతం మొత్తానికి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
కళ్లక్కడల్ అంటే ఎటువంటి ముందస్తు వాతావరణ సంకేతాలు (గాలివాన వంటివి) లేకుండానే సముద్ర మట్టం ఒక్కసారిగా పెరిగి, తీరంపైకి భారీ అలలు విరుచుకుపడే దృగ్విషయం. ఇన్కోయిస్ హెచ్చరికల ప్రకారం సెంప్టెంబర్ 26 తెల్లవారుజామున 2:30 గంటల నుండి సెప్టెంబర్ 28 తెల్లవారుజామున 2:30 గంటల వరకు కేరళ తీరంలో 1.0 నుండి 1.5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై, తీవ్రమైన తీరకోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
కేరళలోని తిరువనంతపురం (కాపిల్ నుండి పొజియూర్), కొల్లం, అలప్పుజ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, కణ్ణూర్, కాసరగోడ్ జిల్లాల పరిధిలోని తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కేరళతో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాలు మరియు లక్షద్వీప్ తీరప్రాంతాలకు కూడా కేరళ విపత్తు నిర్వహణ సంస్థ (KSDMA) హెచ్చరికలు జారీ చేసింది.
సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, పడవలను సముద్రంలోకి దించవద్దని KSDMA ఆదేశించింది. అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పడవలను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించడం కూడా ప్రమాదకరమని హెచ్చరించింది. హెచ్చరికలు ఉపసంహరించుకునే వరకు బీచ్ విహారయాత్రలు, పర్యాటక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.