ఢిల్లీలో 'భజన్ క్లబ్బింగ్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
సూర్య జాతీయ డెస్క్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక నాయకుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్క్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన 'భజన్ క్లబ్బింగ్' (Bhajan Clubbing) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సాంప్రదాయ భక్తి సంగీతానికి, ఆధునిక కన్సర్ట్ శైలికి కలయికగా నిలిచిన ఈ వేడుకలో ప్రధాని సాధారణ శ్రోతలతో కలిసి కూర్చుని, చప్పట్లు కొడుతూ, కంజీరా (Tambourine) వాయిస్తూ భజనలను ఆస్వాదించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ఢిల్లీలో భజన్ క్లబ్బింగ్ అత్యద్భుతంగా జరిగింది" అని ప్రశంసించారు. యువత, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మరియు ఇతర దేవతలకు సంబంధించిన భక్తి పాటలను లైవ్ బ్యాండ్ మరియు ఆధునిక లైటింగ్, సౌండ్ సిస్టమ్‌తో ప్రతిధ్వనింపజేశారు.
భక్తి పాటలను ఆధునిక మ్యూజిక్ కన్సర్ట్ శైలిలో లైవ్ గిటార్లు, డ్రమ్స్, ఎలక్ట్రానిక్ బీట్లతో సమర్పించే ఈ 'భజన్ క్లబ్బింగ్' ధోరణి ఇటీవల యువతలో (జెన్ జీ) విశేష ప్రజాదరణ పొందుతోంది. ఆ్యాధ్యాత్మికతను, ఆధునికతను అనుసంధానించే ఈ ప్రక్రియను ప్రధాని మోదీ గతంలో తమ 'మన్ కీ బాత్' ప్రసంగంలో కూడా కొనియాడిన సంగతి తెలిసిందే.
అంతకుముందు రోజు, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో చివరి వరుసలో ఉన్న నిరుపేదల పురోగతిని ఆకాంక్షించే దీన్‌దయాళ్ 'అంత్యోదయ' సిద్ధాంతం, దేశాభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు.