DDU-GKY 2.0: అక్టోబర్ నుంచి 70 వేల మంది గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ
సూర్య జాతీయ డెస్క్: దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన (DDU-GKY 2.0) కింద దేశంలోని 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 70,000 మంది గ్రామీణ యువతకు ఈ ఏడాది అక్టోబర్ నుంచి నైపుణ్య శిక్షణ ప్రారంభం కానున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పోర్టల్ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలకు (PIAs) 1,200కు పైగా ప్రాజెక్టుల ద్వారా 5.6 లక్షల మంది లబ్ధిదారులను కేటాయించారు. అక్టోబర్ నాటికి 2,015 శిక్షణా బ్యాచ్‌లలో దాదాపు 70,000 మంది యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ మొదలుకానుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద యువతకు 3 నుంచి 12 నెలల వ్యవధితో ఉపాధి లభించేలా శిక్షణ ఇస్తారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ప్రమాణాలకు అనుగుణంగా ఈ కోర్సులను రూపొందించారు. 2026 నుండి 2028 వరకు రెండేళ్ల కాలానికి గానూ 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 9 లక్షల కంటే ఎక్కువ శిక్షణా లక్ష్యాలను కేటాయించారు.
శిక్షణా బ్యాచ్‌లను వేగవంతం చేయాలని, అక్టోబర్ 31, 2026 నాటికి కేటాయింపులన్నీ పూర్తి చేసి శిక్షణను సజావుగా ప్రారంభించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీనిపై నిరంతర సమీక్షా సమావేశాలను కూడా నిర్వహిస్తోంది.