ఏఐ నియంత్రణకు 'ఎమర్జెన్సీ బ్రేక్' తప్పనిసరి: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన పిలుపు!
సూర్య టెక్నాలజీ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత విస్తరణలో ముందు వరుసలో నిలుస్తూ ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి అగ్రగామి సంస్థలకు భారీగా మద్దతునిచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏఐ భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. అధునాతన ఏఐ మోడళ్ల పనితీరును అదుపులో ఉంచేందుకు ఒక 'ఎమర్జెన్సీ బ్రేక్' (కిల్ స్విచ్) వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ భద్రత, నియంత్రణపై ఒక సుదీర్ఘ పోస్ట్‌లో మాట్లాడిన సత్య నాదెళ్ల.. ఏ ఒక్క ఏఐ మోడల్‌పైనా పూర్తిస్థాయిలో ఆధారపడకూడదని వ్యాపార, సాంకేతిక సంస్థలకు సూచించారు. మోడళ్లు ఎప్పుడైనా రాజీపడే (కాంప్రమైజ్ అయ్యే) అవకాశం ఉందని ముందుగానే ఊహించి, వాటికి తగిన కట్టుదిట్టమైన భద్రతా కంచెలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత పనుల మధ్యలో ఏదైనా అవకతవకలు గమనిస్తే, సంబంధిత అధీకృత వ్యక్తి (ఆథరైజ్డ్ పర్సన్) తక్షణమే ఆ మోడల్‌ను ఆపగలిగేలా లేదా నిలిపివేసేలా అధికార నియంత్రణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఏఐ మోడళ్లు తీసుకునే ప్రతి చర్యకు మానవులు చదవగలిగేలా స్పష్టమైన ఆధారాలు (Human-readable evidence) తప్పనిసరిగా ఉండాలని నాదెళ్ల నొక్కిచెప్పారు. మోడళ్లలో లోపాలు, వైఫల్యాలు తలెత్తితే వాటిని దాచకుండా సంబంధిత వర్గాలకు వెంటనే బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐ ఏజెంట్ల వినియోగం వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, భద్రతా ప్రమాణాలను విస్మరిస్తే ఊహించని ప్రమాదాలు తప్పవని టెక్ దిగ్గజం హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.