విశాల నయనాలతో కరుణించే తల్లి- కాశీ విశాలాక్షి (అష్టాదశ శక్తిపీఠాలలో 17వది)
విశాల నయనాలతో కరుణించే తల్లి- కాశీ విశాలాక్షి
(అష్టాదశ శక్తిపీఠాలలో 17వది)
********************************
హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం వారణాసి మన దేశంలో అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశి లేదా వారణాసి లయకారుడైన శివయ్యకు అంకితం చేయబడిన క్షేత్రం. దేశంలోని మతపరమైన రాజధానిగా పరిగణించబడుతున్న కాశీ నగరం కేవలం విశ్వనాథునికే కాదు శక్తిపీఠానికి కూడా ప్రసిద్ధి. ఈ నగరం శక్తి ఆరాధనకు కూడా కేంద్రంగా ఉంది. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా మారాయని ప్రతీతి. సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. కాశీ (వారణాసి) విశిష్టత దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో ఉంది, ఇక్కడ హిందువులు మరణిస్తే మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు . ఇది శివుని నివాసమని, కాశీ నగరం పవిత్ర గంగా నది పశ్చిమ ఒడ్డున ఉంది, మరియు ప్రపంచంలోనే పురాతన నగరాలలో ఒకటిగా ఉందని విశ్వసిస్తారు. శివుడు మరియు పార్వతి దేవి ఈ నగరంలోనే నివసిస్తారని అందుకే ఇది అత్యంత పవిత్రమైన నగరంగా పరిగణించ బడుతుంది. ఇది ఆధ్యాత్మికతకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది. మహాభారతం మరియు ఋగ్వేదం వంటి పవిత్ర గ్రంథాలలో కాశీ నగర ప్రాధాన్యత గురించి ప్రస్తావించబడింది. వేల సంవత్సరాల క్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది.
అసలు ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా పేరుపొందింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి కొంత దూరంలోనే విశాలాక్షి అమ్మ కొలువైంది. ‘విశాలాక్షి'అంటే 'పెద్ద కళ్ళు' అని అర్థం. స్కంద పురాణంలో కాశీని సందర్శించే ప్రధాన ఆలయాలలో విశాలాక్షి దేవి ఆలయం ఒకటి. మాత భక్తులు నగరంలోని ఇరుకైన వీధుల గుండా విశాలాక్షి ఆలయానికి చేరుకుంటారు. ఇది భక్తులకు ఆధ్యాత్మికంగా గొప్ప అనుభవం
కాశీలోని మీర్ ఘాట్ ప్రాంతంలో పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న విశాలాక్షి ఆలయాన్ని విశాలాక్షి గౌరీ ఆలయం లేదా కాశీ విశాలాక్షి శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. కాలక్రమేణా వివిధ దండయాత్రలను ఎదుర్కొన్నప్పటికీ, కాశీలోని అనేక ఇతర దేవాలయాల మాదిరిగానే విశాలాక్షి ఆలయం కూడా తన బలాన్ని నిలుపుకుంది. తన సందర్శన సమయంలో, ఆది శంకరాచార్య దేవత యొక్క శక్తులను పునరుజ్జీవింప జేయడానికి పనిచేశాడు. నేటికీ పూజించబడుతున్న ఆలయంలో 'శ్రీ యంత్రం' ను ఆయన ప్రతిష్టించారు. దీనితో పాటు, ఆది గురు శంకరాచార్య ఆలయంలో మరొక దేవత యొక్క 'ప్రతిష్ఠాపన' కూడా చేశారు.
వారణాసిలోని శక్తిపీఠం విశాలాక్షి చాలా పురాతనమైన మరియు ప్రసిద్ధమైన ఆలయం. తంత్ర చూడామణి ప్రకారం, మాతా సతి రత్నాలతో నిండిన చెవిపోగులు (కుండలం) వారణాసిలో పడ్డాయి. ఆ తరువాత, కాశీలో మాతా విశాలాక్షిని శక్తిగా మరియు భైరవుడిని కాల భైరవిగా పూజిస్తారు. మాతా విశాలాక్షి ఆలయం కాశీ విశ్వనాథుని ఆలయానికి సమీపంలో ఉంది. విశ్వనాథుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు కాబట్టి ఈ ఆలయంలో కాశీ విశ్వనాథునికి ఒక మంచం కూడా ఉంది. విశాలాక్షి దేవిని పూజించడం ద్వారా మనశ్శాంతి, ఆనందం, సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయి. ఇక్కడ మాతా అన్నపూర్ణ పూజ మరియు నైవేద్యాలలో పాల్గొనే భక్తులు తమ ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరతను ఎదుర్కోరు ఎందుకంటే మాతా విశాలాక్షిని కూడా మాతా అన్నపూర్ణ యొక్క దైవిక రూపంగా భావిస్తారు.ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భగుడిలో రెండు రూపాల్లో దర్శనమిస్తుంటుంది. ఓ రూపం స్వయంభువు, మరో రూపం అర్చామూర్తి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా అర్చామూర్తిని దర్శించుకుని ఆ తర్వాత స్వయంభుని దర్శించుకోవాలి. ఇక్కడ కొలువైన విశాలాక్షి అమ్మవారి గుడి చాలా చిన్నది. బంగారు తొడుగుతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో దక్షిణాది సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. శక్తి ఆగమ శాస్త్రంలో తమిళ బాహ్మణులు పూజలు నిర్వహిస్తారు. ఆదిశంకరాచార్యాలు శ్రీ చక్రం ప్రతిష్టించినప్పటి నుంచి అక్కడ దక్షిణాది సంప్రదాయాలు పాటించడం ప్రారంభించారు. అమ్మవారి ఎదురుగా ఉన్న శ్రీచక్రం భక్తులు తాకి నమస్కరించుకోవచ్చు. ఆలయంలో శిష్యులతో ఉన్న శంకరాచార్యుల ఫొటో కనిపిస్తుంది. అమ్మవారి గుడి చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉంటాయి.
:శక్తి పీఠం విశిష్టత:
ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడిన ప్రదేశం. అష్టాదశ శక్తి పీఠాలలో వారణాసి 17 వది.పురాణాలలో విశాలాక్షిని ఈ విశ్వాన్ని పరిపాలించే దేవతగా వర్ణించారు. తాంత్రిక శాస్త్రంలో మహాకాళి రూపంగా చెబుతారు. కాశీలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుందని..కాశీ విశ్వనాథుడు మహాకాళుడి రూపంలో మారి చనిపోయిన వారి చెవిలో తారకమంత్రం ఉపదేశించి మోక్షాన్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి.
:అన్నపూర్ణాదేవి వృతాంతం:
స్కాంద పురాణంలో ఉన్న ఓ కథ ప్రకారం వారణాసిలో వ్యాసభగవానునికి, ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఆగ్రహంతో వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాడట. అప్పుడు అన్నపూర్ణగా అవతరించిన విశాలాక్షి వ్యాసుడిని, తన శిష్యులను ఆహ్వానించి భోజనం వడ్డించింది. అయితే కాశీపై ఆగ్రహం చూపిన వ్యాసుడిని పరమేశ్వరుడు కాశీ నుంచి బరిష్కరించడం..తప్పు క్షమించమని వ్యాసుడు వేడుకోవడంతో ... తిరిగి కాశీలోకి అనుమతిస్తానని శివుడు చెప్పాడు. అన్నపూర్ణ, విశాలాక్షి ఒకరే అన్నది భక్తుల భావన. అయితే కాలక్రమంలో రెండు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాధుని గుడికి దగ్గరలో అన్న పూర్ణ ఆలయం .దీనికి కొద్ది దూరం లో విశాలాక్షి ఆలయం ఉంది. అవివాహితులు గంగలో స్నానమాచరించి విశాలాక్షిని దర్శించుకుంటే చక్కని భాగస్వామి లభిస్తారు.మణి కర్ణికా ఘాట్ లో వేలమంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
*********-----************
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com