చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 3 మణిపూరంలో మోగిన గంట - చంద్రఘంటా నాదం (ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక)
చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 3
మణిపూరంలో మోగిన గంట - చంద్రఘంటా నాదం (ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక)
*************************
:చంద్రఘంట ధ్యాన శ్లోకం:
పిండజ ప్రవరారూఢా
చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా
నవదుర్గలలో మూడో అవతారమైన దుర్గాదేవిని నవరాత్రుల్లో మూడో రోజైన ఆశ్వీయుజ శుక్ల తదియ నాడు చంద్రఘంటదేవిగా పూజిస్తారు. చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు ఘంటాకృతి లో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది
:పాలక గ్రహం: శుక్ర గ్రహం చంద్రఘంట దేవిచే పరిపాలించ బడుతుంది. చంద్రఘంట దేవి మణిపూర చక్రం తో అనుబంధించబడినది. ఇది నాభి వద్ద ఉంది, శక్తి మరియు విశ్వాసానికి కేంద్రంగా ఉంది. జీవితంలోని సవాళ్లను అధిగమించడానికి అంతర్గత బలం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి భక్తులు నవరాత్రి మూడవ రోజున ఆమెను పూజిస్తారు, ఈ దేవతను ధ్యానించడం వల్ల మణిపుర చక్రాన్ని సమతుల్యం చేసి దాని కీలక శక్తి తో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మరియు వ్యక్తిగత శక్తిని నియంత్రించే శక్తివంతమైన శక్తిని కేంద్రంగాపొందగలరని, దీనివల్ల ఆత్మవిశ్వాసం, సాధికారత మరియు అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది.
:చంద్రఘంటా దుర్గ ఇష్టమైన పువ్వు: మల్లెపూలు
:చంద్రఘంటా మంత్రం: దేవ్యై చంద్రఘంటాయైనమః
చంద్రఘంటా దుర్గా, దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే శిరస్సు పై అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.
:చంద్రఘంటా దుర్గా రూప వర్ణన:
చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ, సింహం మీదగానీ వాటిని వాహనముగా అధిరోహిస్తుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి. పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు.ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
:పురాణ గాథ:
శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నతరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి, తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో, లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు.ఆ తరువాత శివ, పార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది. శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.
శ్రీ చంద్రఘంట దుర్గా దేవి ఆలయం ...
వారణాసిలో నవదుర్గ ఆలయాలు ప్రత్యేకమైనవి. ముఖ్యంగా ఈ చంద్రఘంటా ఆలయం చౌక్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉంది. వారణాసిలోని చంద్రఘంట దేవి మందిరం జైత్‌పురిలో వారణాసి, ఉత్తర ప్రదేశ్ లొ ఉంన్ది. నవరాత్రి మూడవ రోజున భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి కొబ్బరికాయలు, చున్రిస్ అని పిలువబడే ఎర్రటి గుడ్డ ముక్కలు మరియు ఎర్రటి పువ్వుల రూపంలో నైవేద్యాలు చేస్తారు. వారణాసిలోని దేవాలయం కాకుండా, భారతదేశం అంతటా ప్రజలు ఈ పవిత్రమైన రోజున చంద్రఘంట విగ్రహాలను పూజిస్తారు.
అమ్మవారి నైవేద్యం ...
నవరాత్రి ఉత్సవాలలో ప్రతి మూడవ రోజు శుక్లపక్షంలో దీన్ని జరుపుకుంటారు. చంద్రఘంటా అమ్మవారిని పూజిస్తారు మీరు ప్రసాదంగా నైవేద్యం పాలు, స్వీట్లు లేదా ఖీర్లను అందించడం ద్వారా అమ్మవారు సంతోషిస్తుంది. అన్ని తప్పులను మరియు దుష్టశక్తులను నాశనం చేయటానికి అవతరించిన రూపం చంద్రఘంట దేవత.
చంద్రఘంటా స్తుతి -
యాదేవీ సర్వభూతేషు
చంద్రఘంటారూపేణ సంస్థితా
నమస్తస్మైనమస్తస్మై
నమస్తస్మైనమో నమః
::::::::::::::::::::::::::::::::::::::::::::::
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారములు కనకదుర్గమ్మ కి 10 రోజులు 10 అలంకారములు చేస్తారు. అందులో భాగంగా అక్టోబరు 13 మంగళ వారం ఆశ్వీజ శుద్ధ తదియ “శ్రీ అన్నపూర్ణ దేవి” గా మూడవరోజు అలంకారము చేస్తారు.
అమ్మవారి నైవేద్యము: దద్దోజనం లేదా కట్టె పొంగలి
అమ్మవారికి అలంకరించే వస్త్రము: పసుపు, లేదా గంధం రంగు చీర