అనకాపల్లికి ఆధ్యాత్మిక శోభ తెచ్చిన ప్రవచనకర్త బాల సౌజన్య.
అనకాపల్లి, నవంబర్ 17, మేజర్ న్యూస్: కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా శివ కళ్యాణ ఘట్టంపై ఆధ్యాత్మిక ప్రవచన వైభవం అందరినీ ఆకట్టుకుంది. అనకాపల్లి కుంచావారి వీధిలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గౌరీ పరమేశ్వరుల దేవస్థానంలో కార్తీక మాస ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ఉత్తమ ఉపాధ్యాయ రత్న, జాతీయ అక్షర ప్రవీణ, నంది అవార్డు గ్రహీత ఏ. బాల సౌజన్య కుమారిచే శివ కళ్యాణం ఘట్టం అనే అంశంపై ప్రవచనం జరిగింది. మొదటి జన్మలో సతీదేవిగా, రెండవ జన్మలో పార్వతీదేవిగా జన్మించిన ఆమె శివుడి కోసం ఎటువంటి నిష్ఠతో తపస్సు చేసిందో, ఆ తపస్సుకు మెచ్చిన శివుడు మాయా బటువుగా, బ్రహ్మచారిగా ప్రత్యక్షమై పార్వతిని వివాహం చేసుకుంటానని మాట ఇవ్వడం, వివాహ వేడుక వృత్తాంతాన్ని వివిధ ఉదాహరణలతో సోదాహరణంగా వివరిస్తూ, కైలాసమా భూలోకమా అనే విధంగా ప్రవచన అంశాలను నేటి సమాజంతో ముడివేస్తూ సాక్షాత్తు శివ కళ్యాణం ఎదురుగా జరుగుతుందనే భావనలోకి ప్రజలను తీసుకువెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని మనసులో సంకల్పాన్ని సిద్ధించే విధంగా చేసుకోవాలంటే పార్వతీదేవిలా ఘోరమైన తపస్సు చేయడం అవసరమని చెప్పారు. అటువంటి సందర్భంలో మాత్రమే మనం అనుకున్నది సాధించగలమని, నేటి విద్యార్థులకు ఇటువంటి తపస్సు విద్యలో చాలా అవసరమని భావాన్ని వ్యక్తం చేశారు. ఆది దంపతులు, ఆదర్శప్రాయులైన శివపార్వతుల లాంటి వైవాహిక జీవితాన్ని అనుసరించాలని, భార్యాభర్తలు ఇద్దరూ సర్దుకుపోతూ అర్ధనారీశ్వరుల జీవనం సాగించడమే సనాతన ధర్మమని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బంగారు వర్తక సంఘ గౌరవ అధ్యక్షులు కొణతాల రాజేంద్ర, సరోజా దంపతుల చేతుల మీదుగా ప్రవచనకర్త సౌజన్యకు ఘన సన్మానం చేసి సత్కరించారు. ఆలయ ధర్మకర్తల మండలి కుంచా చిన్ను, కుంచా బాబురావు రెడ్డి, మల్లేశ్వరరావు, కృష్ణ తదితరులు, భక్తులు అందరూ ప్రవచనాన్ని విని ఇటువంటి ధార్మిక సనాతన సంప్రదాయ సంస్కృతికి చిహ్నంగా ఉన్న భాష నేటి సమాజానికి చాలా అవసరమని ప్రశంసలు అందించారు.
రిపోర్టర్ : నాగు యన్నంశెట్టి, అనకాపల్లి.