ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం అరుంధతి నక్షత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఆది సాయికుమార్ కెరీర్‌లో ఇది 28వ చిత్రంగా తెరకెక్కుతోంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మేఘ శెట్టి మరియు మధు దామరాజు కథానాయికలుగా నటిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంతో కూడిన ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రంగా అరుంధతి నక్షత్రం తీర్చిదిద్దుతున్నారు. 7 పి. ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డాక్టర్ సూర్యకాంతి కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సాయికుమార్ క్లాప్ కొట్టగా, నిర్మాతలు రమేష్ పుప్పాల, డాక్టర్ సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం చిత్ర నిర్మాతలు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్‌కు స్క్రిప్ట్ అందజేశారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. గత చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోను గుర్తుచేసే విధంగా మెమొరీ కార్డులోని ఫొటోలను పోస్టర్లుగా ప్రింట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా గ్రామీణ కుటుంబ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ నెలలోనే అరుంధతి నక్షత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఆది సాయికుమార్, రాహుల్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ రూరల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు తప్పకుండా మంచి వినోదాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read: ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. గ్రామీణ అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్!