నోవో హోల్డింగ్స్ మద్దతు ఉన్న విండ్‌వార్డ్ బయో అరంగేట్రం
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ లైఫ్ సైన్సెస్ పెట్టుబడి సంస్థ 'నోవో హోల్డింగ్స్' (Novo Holdings) బలమైన మద్దతు కలిగిన స్విట్జర్లాండ్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ 'విండ్‌వార్డ్ బయో గ్రూప్' (Windward Bio) అమెరికా స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా అడుగుపెట్టింది. నాస్‌డాక్ గ్లోబల్ మార్కెట్‌లో (Nasdaq) జరిగిన తన తొలి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 107 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 8,400 కోట్లు) చేరుకున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
బాసెల్ కేంద్రంగా పనిచేస్తున్న విండ్‌వార్డ్ బయో సంస్థ తన ఐపీఓలో భాగంగా ఒక్కో షేరును 17 డాలర్ల ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. నిర్ణీత శ్రేణి (16 - 18 డాలర్లు) మధ్యలో ఈ ధరను నిర్ణయించగా, ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ సుమారు 175 మిలియన్ డాలర్లను సమీకరించింది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రోజునే షేర్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. నాస్‌డాక్‌లో ఈ కంపెనీ 'WWB' అనే ట్రిక్కర్ సింబల్‌తో ట్రేడవుతోంది.
శ్వాసకోశ మరియు చర్మ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన అత్యాధునిక యాంటీబాడీ ఔషధాల అభివృద్ధితో పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా, ఫ్రెంచ్ ఫార్మా దిగ్గజం 'సనోఫీ' (Sanofi) కూడా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. నోవో హోల్డింగ్స్‌తో పాటు ఆర్బిమెడ్, బ్లూ అవుల్ వంటి దిగ్గజ సంస్థల అండదొరకడంతో బయోటెక్ రంగంలో ఈ ఐపీఓపై భారీ అంచనాలు నెలకొన్నాయి.