ముగియనున్న పసిడి రుణాల హవా
పర్సనల్ లోన్ల పుంజుకోవడంతో క్రెడిట్ మార్కెట్లో భారీ మార్పులు
సూర్య బిజినెస్ డెస్క్: భారతదేశపు రుణ మార్కెట్‌లో అసురక్షిత రుణాల విభాగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా విపరీతమైన ఆదరణ పొందిన పసిడి రుణాల (గోల్డ్ లోన్స్) హవా త్వరలోనే తగ్గుముఖం పట్టనుందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ గ్లోబల్ రీసెర్చ్ వెల్లడించింది. దీనికి భిన్నంగా వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్) మళ్లీ తమ పాత ఆధిపత్యాన్ని సాధించేందుకు వేగంగా పుంజుకుంటున్నాయని తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి పసిడి రుణాలు రికార్డు స్థాయిలో 50 శాతం ఏటా వృద్ధి చెంది మొత్తం 18.6 లక్షల కోట్ల రూపాయలకు చేరడమే కాకుండా దేశ జీడీపీలో ఐదు శాతానికి విస్తరించినప్పటికీ, బంగారం ధరలు స్థిరపడటంతో ఈ విభాగంలో వృద్ధి మందగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా నిబంధనల కఠినతరం మరియు క్రెడిట్ నియంత్రణల కారణంగా నెమ్మదించిన వ్యక్తిగత రుణాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌సీలు) వ్యక్తిగత రుణాల వృద్ధి సంవత్సర ప్రాతిపదికన 30 శాతానికి చేరగా, బ్యాంకుల్లో ఇది 9 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా ఆస్తి నాణ్యత విషయంలో కూడా పర్సనల్ లోన్లలో బకాయిలు గణనీయంగా తగ్గుతుండగా, పసిడి రుణాలలో మాత్రం ఎగవేతలు స్వల్పంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పర్సనల్ లోన్ల వృద్ధి తిరిగి వేగం పుంజుకోవడంతో బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వంటి ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు అత్యధిక లబ్ధి పొందుతాయని యూబీఎస్ విశ్లేషించింది. ఆయా సంస్థల రేటింగ్‌లు మరియు లక్ష్య ధరలను కూడా పెంచింది. వడ్డీ రేట్ల పెరుగుదల ముప్పు ఉన్నప్పటికీ, వ్యవస్థలో తగినంత నగదు లభ్యత ఉండటం వల్ల ఫైనాన్స్ రంగానికి ఆశించిన స్థాయిలో మద్దతు లభిస్తుందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.