ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మీడియాతో ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు, మేజర్‌న్యూస్ :
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు స్థానిక సంస్థల్లోనూ ప్రజలు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల్లో ఒకే ఆలోచనతో పనిచేసే నాయకత్వం ఉంటేనే క్షేత్రస్థాయిలో అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరారు. జనసేన నేతలు పెద్దపూడి విజయ్ కుమార్ , మన్నె శ్రీకాంత్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.12,600 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ 59 కేసులు వేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేసిందని విమర్శించారు.
27 నెలల్లో 90 శాతం హామీల అమలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని ఏలూరి తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాల రూపంలో సుమారు రూ.1.50 లక్షల కోట్లను ప్రజలకు అందించామని వివరించారు.
తల్లికి వందనం పథకం ద్వారా 42.69 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో రూ.12,485.41 కోట్లు జమ చేశామని తెలిపారు.
దీపం-2.0 పథకం ద్వారా ఇప్పటివరకు 5.1 కోట్ల గ్యాస్ సిలిండర్లు అందించేందుకు రూ.3,942 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు, విద్యార్థినులు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, ఈ పథకానికి రూ.3,550 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
యువతకు ఉపాధి.. పేదలకు భరోసా
యువగళం హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏలూరి తెలిపారు. రాష్ట్రానికి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుల్ నియామకాలు, ఏపీపీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి రూ.79 వేల కోట్లు అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 273 అన్న క్యాంటీన్ల ద్వారా 11 కోట్ల మంది రూ.5కే భోజనం చేశారని వివరించారు.
కూటమి ప్రభుత్వం 27 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేసిందని, గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 87 శాతం హామీలను విస్మరించిందని ఏలూరి విమర్శించారు. మద్య నిషేధం, ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
తుపాను బాధితులకు తక్షణ సాయం
అర్నాబ్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించిందని ఏలూరి తెలిపారు. ఆర్టీజీఎస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం నివారించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్, రహదారులు, తాగునీటి వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించామని, బాధితులకు నిత్యావసరాలు, వైద్య సదుపాయాలు కల్పించామని వివరించారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు త్వరితగతిన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట
బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 34 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని, బీసీ రక్షణ చట్టం-2026 రూపకల్పన చేపట్టామని తెలిపారు. బీసీల కోసం బడ్జెట్లో రూ.1.37 లక్షల కోట్లు కేటాయించామని, వివిధ కార్పొరేషన్ల ద్వారా 117 లక్షల మందికి రూ.32,533 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. గౌడులకు మద్యం దుకాణాల్లో 10 శాతం, వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 33 శాతం కేటాయింపులు కల్పించామని వివరించారు.
ఎస్సీల అభివృద్ధికి రెండున్నరేళ్లలో రూ.40,925 కోట్లు ఖర్చు చేశామని, జగ్జీవన్ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి రూ.24,908 కోట్లు వెచ్చించామని, అడవి తల్లి బాట పథకం ద్వారా రూ.1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి రూ.16,147 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.
మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు
రాష్ట్రంలో దెబ్బతిన్న 23,450 రహదారుల మరమ్మతులకు రూ.1,200 కోట్లు ఖర్చు చేశామని ఏలూరి తెలిపారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తూ 39 వేల కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 5.5 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించామని, మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జల్ జీవన్ మిషన్ 2.0 (అమరజీవి జలధార) ద్వారా రూ.30,156 కోట్లతో 27 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అమృత్ 2.0 కింద రూ.10,319 కోట్లతో 281 ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ, చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
అభివృద్ధి కొనసాగాలంటే కూటమికి అండగా నిలవాలి
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగడం అవసరమని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామస్థాయి వరకు అభివృద్ధి ఫలాలు అందించాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని కోరారు. ప్రజల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల అభ్యున్నతి, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి ప్రస్థానానికి ప్రజలు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష.