రెండోసారి డిస్కవర్ అనంతపురానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన, నీటి వనరుల శుభ్రత, సామూహిక పారిశుధ్య కార్యక్రమాలు, ప్రజా అవగాహనలో సేవలందిస్తున్న డిస్కవర్ అనంతపురంకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గుర్తింపు లభించింది.
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో అనంతపురం జిల్లాలో ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా డిస్కవర్ అనంతపురం ఎంపికైంది. వరుసగా రెండోసారి ఈ అవార్డు దక్కడం విశేషం. అక్టోబర్ 2న అలెగ్జాండర్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కాలువలు, నీటి వనరులు, బహిరంగ ప్రదేశాల్లో భారీ స్థాయిలో శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వందలాది మంది పౌరులు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేస్తూ ‘మన ప్రాంతం–మన బాధ్యత’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పాత చీరలతో ‘సారీ టు షాపింగ్ బ్యాగ్’ కార్యక్రమం ద్వారా 1.10 లక్షలకు పైగా వస్త్ర సంచులను పంపిణీ చేశారు. మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
డిస్కవర్ అనంతపురం వ్యవస్థాపకుడు జి. అనిల్ కుమార్ నాయకత్వంలో రాగ్ పికర్స్, పారిశుధ్య కార్మికుల సంక్షేమంపై కూడా సంస్థ దృష్టి సారిస్తోంది. స్వచ్ఛతను నిరంతర ప్రజా ఉద్యమంగా మార్చడమే లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.