పరిషత్ సమరానికి సర్వం సిద్ధం! * 30 జడ్పీటీసీలు, 523 ఎంపీటీసీ స్థానాలకు 5న పోలింగ్ *
శ్రీకాకుళం, సూర్య : జిల్లాలో నవంబర్ 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు బహిరంగ ప్రచారానికి తెరపడగా అధికారులు క్షేత్రస్థాయి ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 జడ్పీటీసీ స్థానాలు, 542 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా.. వీటిలో 19 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జడ్పీటీసీల్లో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. దీంతో 30 జడ్పీటీసీ స్థానాలకు గాను 95 మంది అభ్యర్థులు, మిగిలిన 523 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,222 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
16.20 లక్షల మంది ఓటర్లు.. మహిళలే అధికం :
పరిషత్ పోరులో మొత్తం 16,20,965 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 8,04,745 మంది ఉండగా, పురుషుల కంటే అధికంగా 8,16,164 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 56 మంది నమోదయ్యారు. ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ బందోబస్తు.. వెబ్‌కాస్టింగ్ :
ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,004 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 449 సమస్యాత్మక, 308 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా 757 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. పోలింగ్ ప్రక్రియ కోసం 3,646 పెద్ద బ్యాలెట్ పెట్టెలు, 384 మధ్యస్థాయి, 146 చిన్న బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
సిబ్బంది, వాహనాల మోహరింపు :
పోలింగ్ నిర్వహణకు 31 మంది రిటర్నింగ్ అధికారులు, 33 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 191 మంది జోనల్ అధికారులు, 310 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బూత్‌ల స్థాయిలో 2,220 మంది ప్రిసైడింగ్ అధికారులు, 8,898 మంది ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 11,118 మంది ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే విడతలవారీగా శిక్షణ పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు 30 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 281 భారీ వాహనాలు, కార్లు, జీపులు తదితర 230 చిన్న వాహనాలను సిద్ధం చేశారు.
4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు :
పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలో 4 ప్రధాన కేంద్రాలను ఎంపిక చేశారు. చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల, టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాల, పలాస ప్రభుత్వ హైస్కూల్, పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 71 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయగా.. లెక్కింపు ప్రక్రియ కోసం 658 మంది సూపర్‌వైజర్లు, 2,073 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.