మూలా నక్షత్రం రోజున ఉచిత దర్శనానికే ప్రాధాన్యం.. ప్రోటోకాల్ దర్శనాలు రద్దు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రుల్లో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అక్టోబర్ 16, శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు సులభంగా, వేగంగా దర్శనం కల్పించేందుకు అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన మార్గాలుగానే నిర్వహించనున్నారు. సాధారణ భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ, ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికీ ముఖమండపం నుంచే శ్రీ సరస్వతీ దేవి అలంకార దర్శనం కల్పించనున్నారు. కొండపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. సర్వీస్ పాసులతో సహా ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల వాహన పాసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అత్యవసర అధికారిక రవాణాకు మాత్రమే అనుమతి ఉంటుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయాలకు ప్రముఖులు, భక్తులు సహకరించి, క్రమశిక్షణతో ప్రశాంత వాతావరణంలో జగన్మాతను దర్శించుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.