కూటమి పొత్తు ధర్మాన్ని అందరూ పాటించాలి: కొండపల్లి రవి ### పార్టీలో ఉంటూ నాయకుడిపై దుర్భాషలాడింది ఎవరూ? అసెంబ్లీ ఎన్నికల్లో చిర్రి బాలరాజుకు టికెట్ ఇవ్వొద్దని ధర్నాలు చేసింది ఎవరు? అంటూ ప్రశ్న
టి. నరసాపురం, మేజర్ న్యూస్ కూటమి పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రవి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ ప్రకారం టి. నరసాపురం ఎంపీపీ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించడంతో కూటమి నాయకులంతా సమావేశమై మాజీ రాష్ట్ర కోశాధికారి జయ్యవరపు శ్రీరామ్మూర్తిని ఏకగ్రీవంగా ఎంపీపీ అభ్యర్థిగా ప్రతిపాదించారని ఆయన తెలిపారు.
శుక్రవారం స్థానిక విజయలక్ష్మి థియేటర్ వద్ద మండల టీడీపీ అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కొండపల్లి రవి మాట్లాడుతూ, పార్టీ కోసం ఎంతోకాలంగా నిబద్ధతతో పనిచేసిన జయ్యవరపు శ్రీరామ్మూర్తిని అందరూ అంగీకరించినప్పటికీ, ఇప్పుడు కొందరు ఎంపీపీ పదవి తనకే కావాలంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
గత శాసనసభ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడిపై దుర్భాషలాడిన వారే, పోలవరం టికెట్ జనసేనకు కేటాయించవద్దని పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన వారేనని ఆరోపించారు. అలాంటి చర్యల వల్ల మండలంలో టీడీపీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
### గ్రూపు రాజకీయాలు మానుకోవాలి
మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, శ్రీరామ్మూర్తి ఇంటి వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయనే ఎంపీపీ అభ్యర్థి అని అంగీకరించిన వారు ఇప్పుడు గ్రూపు రాజకీయాలు చేస్తూ పదవి కోసం పట్టుబట్టడం సరైంది కాదన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూరంగా ఉండి, ఇప్పుడు అధికారంలోకి రాగానే పదవుల కోసం పార్టీని అప్రతిష్ఠపాలు చేయడం బాధాకరమన్నారు.
### కూటమి నిర్ణయానికే కట్టుబడి ఉంటాం
జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజు మాట్లాడుతూ, కూటమి ఒప్పందం ప్రకారం టీడీపీకి 10, జనసేనకు 6, బీజేపీకి ఒక ఎంపీటీసీ స్థానం కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. ఆ నిర్ణయానికి తూట్లు పొడుస్తూ జనసేనకు టికెట్ ఇవ్వొద్దని ధర్నాలు చేసిన వ్యక్తులే ఇప్పుడు ఎంపీపీ పదవిపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు.కూటమి నాయకులు ఏకగ్రీవంగా జయ్యవరపు శ్రీరామమూర్తి పేరును ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఇప్పుడు పదవి తనకే కావాలని అడగడం ఆశ్చర్యకరమన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ అన్ని ఎంపీపీ స్థానాలను కూటమి ఖాతాలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బొంతు సత్యనారాయణ,నాళం కాశి, ఆదిత్య, కొరివి శ్రీకాంత్, భూక్యా వేణు,కన్నం సర్వేశ్వరరావు, పాలేటి సత్యనారాయణ, పెట్టిన సత్యనారాయణ కాసానేని వెంకట్రావు గుండు శ్రీనివాస్, తో పాటు మండలంలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.