ఖాసాపేటలో ఘనంగా షిరిడీ సాయిబాబా జయంతి వేడుకలు భారీ అన్న సమారాధన పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల
లక్క వరపు కోట , సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్ : మండలములోని ఖాసాపేట గ్రామంలో షిరిడీ సాయిబాబా191 వ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని సాయిబాబా ఆలయాన్ని పూలతో శోభాయమానంగా అలంకరించి, ఉదయం నుంచే అభిషేకాలు, విశేష అర్చనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఖాసాపేట తన స్వగ్రామం కావడంతో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, గ్రామం మరింతగా అభివృద్ధి చెందాలని బాబావారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జయంతి వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహా అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు