BREAKING
లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్ దుర్గా దేవి ప్రతిరూపం బాల కన్యలు .. వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఘనంగా సద్దుల బతుకమ్మ అమ్మవారి మండపాలను సందర్శించిన లక్ష్మణ్‌గౌడ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదు.. పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా నయీమ్ తాజ్ బోనిలో ఘనంగా అన్నదానం...!!

కౌన్ బనేగా క్యాండిడేట్?!

Select Suryaa Now
కౌన్ బనేగా క్యాండిడేట్?!

విజయనగరం, సూర్య : మున్సిపోల్స్ లో సీట్ల చిచ్చు చల్లారకముందే జిల్లాపరిషత్ లొల్లి మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై టీడీపీలో ముగ్గురు ప్రముఖులు కన్నేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పట్నుంచే  ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు కూడా వార్తలు తెరపైకి వస్తున్నాయి. అన్నింటికిమించి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీలక్ష్మి బరిలో దిగనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తోసిపుచ్చేందుకు అవకాశంలేదని పరిశీలకవర్గాలు పేర్కొంటున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి కేటాయించిన జిల్లాపరిషత్ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే.
నిజానికి, ఈ స్థానాన్ని చిన్నశ్రీను తనయ సిరి సహస్రకు పక్కా అని అంతా భావిస్తూ వచ్చారు. అయితే, మొత్తం జిల్లా పాలనా వ్యవహారాలతో ముడిపడిఉండడం, కనీస పూర్వానుభవం లేకపోవడంతో విజయనగరం కార్పొరేషన్ మేయర్ పై దృష్టిపెడితే ఓటు విషయంలో ఎదురైన సాంకేతిక సమస్యవల్ల దూరమయ్యారు. అదే సమస్య జిల్లాపరిషత్ కూ వర్తిస్తుందికనుక ఈ రేసునుంచి కూడా ఆమె వైదొలగక తప్పని పరిస్థితి. వాస్తవానికి ఆమెకు ఎటువంటి అడ్డంకులు ఉండని పక్షంలో, టికెట్ విషయంలో ఏకాభిప్రాయం ఉండేది. ఇలాఉంటే, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవికోసం టీడీపీ నుంచి ముగ్గురు నేతలు గుట్టుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు తన కోడలు కిమిడి సంధ్యను బరిలోకి దింపేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు వినికిడి. కిమిడి కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు చీపురుపల్లి రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి పార్టీ పదవిని కూడా నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య సంధ్య విద్యాధికురాలే కాకుండా వ్యాపారరంగంలో కూడా చురుగ్గా ఉన్నారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ లో ఎంబీఏ చేసిన సంధ్య, సప్తగిరి వేర్ హౌసెస్ డైరెక్టర్ గా, నందిని టీ ట్రేడర్స్, గురుదత్తా ఎంటర్ ప్రైజెస్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు తన కుమార్తె కర్రోతు చంద్రకళ కోసం విస్తృత స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. పలువురు పార్టీపెద్దలను కలిసినట్టు చెబుతున్నారు. అలాగే, అనుకూలవర్గాలతో చర్చలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొన్నివర్గాలతో విందు రాజకీయంతో మొదలైన ఆయన ప్రయత్నాలు.. గుట్టుగా గోప్యంగా కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, డెంకాడ మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకుడు కంది చంద్రశేఖర రావు కూడా సతీమణి రమాదేవికి అధిష్ఠానం ఆశీస్సులు కోసం తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఈయన నెల్లిమర్ల ఎమ్మెల్యే సహా పలు పదవుల రేసులో ఉన్నా అవకాశం దక్కక స్వల్ప అసంతృప్తితో ఉన్నట్టు చెబుతుంటారు. ఇక, వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరవుతారనే ఉత్కంఠకు మెల్లమెల్లగా తెరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ స్థానానికి బొత్స తన కుమార్తె డాక్టర్ అనూష ను రంగంలో దించాలని గట్టిగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయనే మీడియా సమావేశంలో ప్రకటించారు కూడా. ఆ తర్వాత పరిణామాలు జిల్లావాసులకు తెలిసిందే. అనూషను జెడ్పీ పీఠంపై కూర్చుబెట్టాలని బొత్స నిర్ణయించగా, తెరవెనుక ఏం జరిగిందో ఏమోగానీ, ఆమెను చిన్నశ్రీను రాజీనామాతో ఖాళీ అయిన భీమిలి ఇంచార్జ్ గా అధినేత జగన్ నియమించి షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో బొత్స కూడా మాట మార్చేశారు. తన కుమార్తె జెడ్పీ రేసులో ఉందని నేనెప్పుడు చెప్పానని నాలుక మడతేశారు. మరి, వైసీపీ తరపున జెడ్పీ అభ్యర్థి ఎవరు? నిన్నటిదాకా అందరిలో ఇదే చర్చ. చిన్నశ్రీను ఎపిసోడ్ అనంతరం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారనే ప్రచారం జరిగింది. ఇది నిజంకూడా.
అనూష భీమిలికి షిఫ్ట్ అవడంతో చైర్మన్ క్యాండిడేట్ ఎవరని చర్చలు జరుగుతున్న వేళ.. తాజాగా బొత్స సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి పేరు తెరపైకి వస్తోంది. ఈమె గతంలో జెడ్పీ చైర్మన్ గా, ఎంపీగా చేసిన అనుభవం ఉంది. జిల్లాప్రజలకు సుపరిచితురాలు. మృదుస్వభావి అనే మంచి అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తప్పితే ఆస్థాయి వ్యక్తి వైసీపీలో లేరనే చెప్పాలి. ఆమెను బరిలో దింపితే, చిన్నశ్రీను ఎపిసోడ్ నేపథ్యంలో సింపతీ కూడా వర్కవుట్ అయి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వంపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా బొత్స శిబిరంనుంచి వినిపిస్తోంది. ఇలాఉంటే, టీడీపీ నుంచి మరోపేరు కూడా మెల్లమెల్లగా బైటకు వస్తోంది. మాజీమంత్రి కిమిడి మృణాళిని పేరు అక్కడక్కడా వినిపిస్తోంది. ఈమె శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ గా, చీపురుపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బీసీ జనరల్ అయితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునను జెడ్పీ బరిలో దించాలని హైకమాండ్ భావిస్తున్నట్టు ఇటీవల అక్కడక్కడా టాక్ మొదలైంది. అదే సమయంలో, అలాచేస్తే జిల్లా అధ్యక్ష పదవి, డీసీసీబీ చైర్మన్ పదవి ఈ రెండింటి బాధ్యతలను వేర్వేరు నేతలకు అప్పగించాలని కూడా అధిష్ఠానం యోచించినట్టు చెబుతుంటారు. అయితే, బీసీ మహిళకు కేటాయించిన నేపథ్యంలో ఆయన మాతృమూర్తి కిమిడి మృణాళినికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని రాష్ట్రపార్టీ పెద్దలు చర్చించుకున్నట్టు కేడర్లో స్వల్ప చర్చ జరిగింది. ఐతే, ఇందులో అణుమాత్రమైనా వాస్తవం లేదని పార్టీవర్గాలు తేల్చిచెప్పేశాయి. కిమిడి నాగార్జున కూడా వీటిని ఊహాజనిత కబుర్లుగా కొట్టిపారేశారు. ఏదేమైనప్పటికీ, మున్సిపోల్స్ ఇంకా నామినేషన్ ఘట్టం దాటకముందే జిల్లాపరిషత్ పీఠంపై బయలుదేరిన ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.