జిల్లాలో తొలి కంటైనర్ సబ్‌స్టేషన్ పనుల పరిశీలన..
పూర్తి స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి.. త్వరలోనే అందుబాటులోకి.. డైరెక్టర్ కె. గురవయ్య వెల్లడి..
నెల్లూరు, వేదాయపాలెం, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం తోపాటు వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు జిల్లాలోని మొదటిసారిగా నెల్లూరు టౌన్ డివిజన్‌లో ఏర్పాటు చేస్తున్న కంటైనర్ సబ్‌స్టేషన్ పనులను ఏపీఎస్పీడీసీల్ డైరెక్టర్ కె. గురవయ్య బుధవారం సాయంత్రం పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన డైరెక్టర్ గురవయ్య మాట్లాడుతూ... ప్రస్తుతం పనులు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు.సబ్‌స్టేషన్‌కు సంబంధించిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని, మిగిలిన విద్యుత్, సివిల్ మరియు ఇతర అనుబంధ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కంటైనర్ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ ప్రాంతంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, లో-వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలను తగ్గించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న ఈ కంటైనర్ సబ్‌స్టేషన్ ద్వారా భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుధాకర్, టెక్నికల్.. కన్ స్ట్రక్షన్... ఆపరేషన్ డివిజన్ విభాగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు.. అసిస్టెంట్ ఇంజనీర్లు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.