జెడ్.పి.టి.సి./ఎం.పి.టి.సి. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతం
విజయనగరం, సూర్య : జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికల నిర్వహణలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ వేసే విజయనగరం జిల్లా పరిషత్ ఆఫీసు, గుర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం,ఆర్.ఏ.వలస ఎం.పి.డి.ఓ. కార్యాలయాల వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పర్యవేక్షించారు. జిల్లా పరిషత్ ఆఫీసు/ఎం.పి.డి.ఓ. ఆఫీసు వద్ద నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగే విధంగా భద్రత చర్యలు చేపట్టామని జిల్లాఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ
జెడ్.పి.టి.సి./ఏం.పి.టి.సి. ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రత చర్యలు చేపట్టామన్నారు.
సెక్షన్ 30 పోలీసు చట్టం, 163 బి.ఎన్.ఎస్.ఎస్. (143 సి.ఆర్.పి.సి) అమలులో ఉందని, ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించ రాదన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎం.సి.సి.) ని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు, రాజాకీయ పార్టీలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నందున ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా నగదును తమ వెంట తీసుకొని వెళ్లవద్దని, ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఎక్కువ నగదు లావాదేవీలు జరిపే అనుమానస్పద వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక దళాలను, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించామన్నారు. జిల్లాలో చేపడుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. తనిఖీల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బహుమతులుగా ఇచ్చే క్రికెట్ కిట్స్, ఇతర వస్తువులు, నగదు వంటివి లభించలేదన్నారు. ఉదయం 6గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. సహేతుకరమైన కారణాలు లేకుండా రాత్రి 10 గంటల తరువాత పట్టణాల్లోను, గ్రామాల్లో ఎవ్వరూ తిరగ వద్దన్నారు. బి.సి.లు, రౌడీలతోపాటు సుమారు 20వేల మందినపై ఎన్నికల్లో ఎటువంటి అల్లర్లుకు పాల్పడకుండా మంచి ప్రవర్తన కోసం బైండోవరు చేసామన్నారు. రూ.1-3 లక్షల మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తుగా సెక్యూరిటీ బాండులను తీసుకోవడం జరిగిందన్నారు.
బ్యాంకుల భద్రతకు వినియోగించే తుపాకులను మినహాయించి, మిగిలిన 346 లైసెన్స్ డ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏవీ లీలారావు, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, చీపురుపల్లి సిఐ జి.శంకరరావు, రాజాం సిఐ నవీన్ కుమార్, రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర, ఇతర పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది ఉన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.