జనసేన బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 100 %శాతం విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే గిడ్డి
పి గన్నవరం మేజర్ న్యూస్ : పి. గన్నవరం మండలంలోని జనసేన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ స్థానిక సంస్థల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, కమిటీలోని సభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాలను గుర్తించి, అక్కడ సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టి 100 % శాతం విజయాన్ని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత, అవకాశం కల్పించాలని అన్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థుల విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా, ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమర్థవంతమైన అభ్యర్థులను గుర్తించి, వారి జాబితాలను ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలని సూచించారు. పార్టీ విజయావకాశాలను పెంపొందించేలా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ, పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ, సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ పరిధిలోని నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నిర్వాహక దళ్ సభ్యులు, సపోర్టింగ్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.