జూనియర్ సివిల్ జడ్జిగా వేముల హారిక ఎంపిక… - హారికకు ప్రభుత్వ విప్ విజయరమణారావు సన్మానం
సూర్య - పెద్దపల్లి రూరల్
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన వేముల హారిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తెలంగాణ హైకోర్టు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో హారిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వేముల లక్ష్మీ–వైకుంఠం దంపతుల కుమార్తె అయిన హారిక న్యాయమూర్తిగా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె సాధించిన విజయంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రాఘవపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును హారిక కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హారికను ఘనంగా సన్మానించి అభినందించారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించి తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ రాఘవపూర్ గ్రామానికి చెందిన హారిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. కష్టపడి చదివి, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన ఆమె యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమిస్తే విజయాలు సొంతమవుతాయని హారిక నిరూపించారని కొనియాడారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంపొందించేలా సేవలందించాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత విద్యకు ప్రాధాన్యమిస్తూ పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత పదవులను అధిరోహించడం అభినందనీయమని పేర్కొన్నారు. హారిక భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, న్యాయరంగంలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై రాఘవపూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హారికను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఆమె విజయం గ్రామంలోని విద్యార్థులకు, యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కొండా సుధాకర
బొడ్డుపెల్లి సదయ్య,
కొడపత్రి సందీప్ ,
ఆడెపు శ్రీనివాస్ ,
చాటకొల్లా సతీష్
గడ్డం శ్రీకాంత్ ,
అర్కూటీ సతీష్ ,
కొడపత్రి మధుకర్,
ఒడ్డపెల్లి శ్రావణ్ లు ఉన్నారు.