హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్
ఇళ్లలో ఉత్పత్తయ్యే తడి వ్యర్థాలను సక్రమంగా వినియోగించుకుని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ కే. వెంకటరమణ ప్రజలకు సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలోని సాయి బాలాజీ టౌన్షిప్‌లో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా హోమ్ కంపోస్టింగ్‌పై బుధవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కూరగాయలు, పండ్ల తొక్కలు, ఆకులు, ఆహార అవశేషాలు వంటి తడి వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించాలన్నారు. వాటిని ఇంటి వద్దే కంపోస్టింగ్ చేసి కొంతకాలం తర్వాత మొక్కలకు ఉపయోగపడే నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని వివరించారు.
హోమ్ కంపోస్టింగ్‌తో ఇంటి నుంచి బయటకు వెళ్లే చెత్త పరిమాణం తగ్గడంతోపాటు పరిసరాల పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు. మొక్కలకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ ఎరువును వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి ఇంట్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.
“ఇంటి వ్యర్థమే మొక్కలకు ఎరువు.. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన పర్యావరణం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ హోమ్ కంపోస్టింగ్‌ను అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. దుర్గాప్రసాద్, శానిటేషన్ సెక్రటరీలు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.