హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు.. సి ఐ చిరంజీవి
హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు.. సి ఐ చిరంజీవి
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
నవంబర్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఏ. శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ఎస్. చిరంజీవి, ఎస్సైలు కె. శ్రీనివాసులు, ఎం. తిమ్మారెడ్డి సహా 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించి అనుమానితులు, రౌడీషీటర్లు, వివాదాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, అల్లర్లు, గొడవలు సృష్టించినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. మహిళలు, బాలికలపై అసభ్యంగా ప్రవర్తించినా, మాదకద్రవ్యాలు, జూదాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఈడిగ నరసన్న గౌడ్ వద్ద 180 ఎంఎల్ పరిమాణం గల 30 చీప్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని, పత్రాలు పరిశీలించిన అనంతరం యజమానులకు అప్పగించారు. అనుమానాస్పద కార్యకలాపాలు, మాదకద్రవ్యాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.
ఏ. రాజ శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా