వైసీపీ నాయకుల అక్రమ అరెస్ట్
ఖాజీపేట మేజర్ న్యూస్:మైదుకూరు మున్సిపల్ నామినేషన్ల వేళ నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర రూపం దాల్చింది. ఖాజీపేట మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ అగ్రనేతలను పోలీసులు స్టేషన్కు తరలించడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, మండల కన్వీనర్ మురళి మోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులతో ఖాజీపేట మండలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాత్రికి రాత్రే రాఘవరెడ్డి, మురళి మోహన్ రెడ్డి ఇళ్లకు చేరుకున్న పోలీసులు, వారికి గృహ నిర్బంధ (హౌస్ అరెస్ట్) నోటీసులు జారీ చేశారు. అనంతరం తెల్లవారుజామున వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సాగుతున్న సమయంలో, వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ రకమైన ఆంక్షలు విధించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియకే పోలీసు యంత్రాంగం ఈ స్థాయిలో ఆంక్షలు, గృహనిర్బంధాలు విధిస్తుంటే.. రాబోయే రోజుల్లో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు ఏ మేరకు ప్రశాంతంగా సాగుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టర్: బొర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇన్ చార్జ్ కడప జిల్లా