బాక్సాఫీస్ వద్ద రణబలి సందడి.. రెండు రోజుల్లో 16 కోట్లు దాటిన విజయ్ దేవరకొండ, రష్మిక మూవీ వసూళ్లు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం రణబలి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం మరియు వివాహం తర్వాత వీరు నటించిన మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్ర వసూళ్ల వివరాల్లోకి వెళితే, మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 9.25 కోట్ల రూపాయల ఓపెనింగ్ వసూళ్లను సాధించిన రణబలి, రెండో రోజైన శనివారం నాటికి 7.17 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు 16.42 కోట్ల రూపాయలకు చేరింది. 1800ల కాలంనాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేపధ్యంలో బ్రిటిష్ పాలకులు సృష్టించిన కృత్రిమ కరవు మరియు దానికి ఎదురొడ్డి పోరాడిన కథానాయకుడి పాత్రలో విజయ్ నటన ఆకట్టుకుంటోంది.
కాగా, ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు కాబోయే నెక్స్ట్ డెఫినింగ్ యాక్షన్ హీరో విజయ్ దేవరకొండ అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆర్నాల్డ్ వోస్లూ, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికి మరిన్ని మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి..
Also Read: బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సునామీ.. మూడు రోజుల్లోనే 144 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న జైలర్ 2!