ఎన్నికలంటేనే గొడ్డలి పార్టీకి గుబులు..
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి; ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే గొడ్డలి పార్టీ కేసులు, వివాదాలతో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ, మరోవైపు అదే ఘటనలను సాకుగా చూపి ఎన్నికలను నిలిపివేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఆదరణ కోల్పోయిన వైఎస్ జగన్.. న్యాయస్థానాల ద్వారా ఎన్నికలకు ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ బీసీ రిజర్వేషన్లు, ఎస్ఐఆర్ తదితర అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయించిందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
సుమారు 60 పిటిషన్ల ద్వారా ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు వేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి మద్దతు పొందాల్సిన పార్టీ.. న్యాయపరమైన వివాదాల ద్వారా ఎన్నికలను నిలువరించాలని చూడటం సమంజసం కాదన్నారు. గౌరవనీయ సుప్రీంకోర్టు పట్ల తెలుగుదేశం పార్టీకి అత్యంత గౌరవం ఉందని, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు పార్టీ కట్టుబడి ఉంటుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గడువు పొడిగింపు అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిందేనని, వాటిపై అనవసర రాజకీయ వివాదాలు సృష్టించడం తగదని స్పష్టం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయని ముందుగానే ఊహించామని పల్లా పేర్కొన్నారు. రాజంపేట, ఎర్రగుంట్ల, కడప, రాయచోటి, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ముఠా చూస్తోందని ఆరోపించారు. బెంగళూరులో కూర్చొని వ్యూహాలు రచిస్తూ, ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను రప్పించి అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు
. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలకు కారణమవుతూ, అదే ఘటనలను చూపి రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం జరుగుతోందంటూ ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. దశాబ్దాలుగా పులివెందుల సహా పలు ప్రాంతాల్లో గొడ్డలి పార్టీ నేతల ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ టీడీపీ శ్రేణులు పోరాడుతున్నాయని పల్లా తెలిపారు. పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడటం ప్రజాస్వామ్యానికి సానుకూల పరిణామమని పేర్కొన్నారు. రాజకీయంగా పట్టు కోల్పోతున్నామనే ఆందోళనతోనే వైసీపీ ముఠా రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే సమయంలోనూ గొడ్డలి పార్టీ అనేక న్యాయపరమైన సవాళ్లు విసిరిందని పల్లా ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం నియామక ప్రక్రియను పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిందని తెలిపారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాల్లోనూ గొడ్డలి పార్టీ వైఖరి అడ్డంకులు సృష్టించేలా ఉందని విమర్శించారు
. అభివృద్ధిని అడ్డుకోవడం, ఎన్నికల ప్రక్రియను నిలువరించేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం ఆ పార్టీ రాజకీయ వ్యూహంగా మారిందని మండిపడ్డారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న నాయకులు ఉన్న గొడ్డలి పార్టీ.. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థల గురించి మాట్లాడే ముందు తన గతాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని పల్లా హితవు పలికారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ప్రజలు కేవలం 11 స్థానాలే కట్టబెట్టడం ఆ పార్టీ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించిందని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వైసీపీ ముఠా దౌర్జన్యాలను ఎదుర్కోవాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ, స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తీర్పును అడ్డుకోలేరని, ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.