ఎన్నికల ప్రచారాలకు పోలీసుల అనుమతులు తప్పనిసరి
చీపురుపల్లి, సూర్య : స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, సమావేశాలు, మైక్ ల కోసం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ జి శంకర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు రాబోయే ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థులకు, రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మార్గదర్శకాలు జారీ చేయడమైనదని వివరించారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిర్వహించే అన్ని రకాల సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచార రథాలు, మైక్/సౌండ్ సిస్టమ్‌లకు చీపురుపల్లి పోలీస్ స్టేషన్ స్థానిక అధికారి నుండి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించే ప్రదేశం, సమయం, ప్రారంభం, ముగింపు వ్యవధి గురించి ముందస్తుగా పోలీసు శాఖకు స్పష్టమైన సమాచారం అందించాలని కోరారు. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించే మార్గాలు, ప్రచార రథాల వివరాలను పోలీసు అధికారులకు సమర్పించి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు లోబడి మాత్రమే మైక్ / సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించాలని తెలిపారు. అనుమతించబడిన పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించరాదన్నారు. అలాగే రాత్రి వేళల్లో మైక్ ల వాడకంపై ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ప్రచారంలో ఏ విధమైన శాంతిభద్రతల విఘాతం కలగకుండా నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ప్రచార రథాలు నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు ఈ నిబంధనలను గమనించి చీపురుపల్లి, గుర్ల, గరివిడి, బుదరాయవలస పోలీసు వారికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శంకర్ రావు కోరారు.
రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.