చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ సాధ్యం
శ్రీకాకుళం, సూర్య : విజ్ఞాన నిలయాలైన గ్రంథాలయాల్లో చదివే ప్రతి ఒక్కరూ చట్టాలపై ప్రాథమిక అవగాహన పెంచుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నవంబరు తొమ్మిదిన జరిగే న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, సమస్యలు ఉన్నవారు 15100 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సమాచార హక్కు చట్టం వినియోగం, వినియోగదారుల పరిరక్షణ చట్టాలపై వివరిస్తూ, వీటి ద్వారా నిబంధనలు తెలుసుకుని ప్రయోజనం పొందవచ్చని స్పష్టం చేశారు.
నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని వచ్చే నకిలీ ఉద్యోగ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల వేధింపులు, ఓటీపీ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని హరిబాబు హెచ్చరించారు. ఆన్‌లైన్ ద్వారా సైబర్ మోసాల బారిన పడితే తక్షణమే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆపద సమయాల్లో మహిళలు 181, చిన్నారుల రక్షణకు 1098 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి వి.వి.జి.ఎస్. శంకర్ రావు, గ్రంథాలయ సిబ్బంది, సుమారు 80 మంది పాఠకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన కరపత్రాలను పంపిణీ చేశారు.