బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్లతో రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు
• దసరా ఉత్సవాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల నిఘా
• భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాకు లక్షలాది మంది భక్తులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్లు, డ్రోన్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) వ్యవస్థలతోపాటు దాదాపు 30 డ్యాష్‌బోర్డులతో కూడిన అధునాతన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ పటిష్టమైన పోలీసు బందోబస్తు అమలు చేస్తున్నారు. బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్ల ద్వారా అధికారిక అనుమతి ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే నిర్దేశిత ప్రాంతాల్లోకి అనుమతిస్తున్నారు. దీంతో అనధికారిక రాకపోకలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు, రద్దీని సమర్థవంతంగా అదుపు చేసేందుకు వీలవుతోంది. పోలీసు శాఖ అమలు చేస్తున్న ఈ అత్యాధునిక విధానాలు ఉత్సవాల నిర్వహణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ ఏర్పాట్లు దోహదపడుతున్నాయి. దసరా ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు భక్తులందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు.
రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.