భారీ వర్షాలపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఆరుమెల్లి
భారీ వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తం
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. అవసరమైతే ముందస్తు తరలింపు
విద్యుత్, రహదారుల సమస్యలపై తక్షణమే స్పందించాలి
అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు,మేజర్ న్యూస్ : వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. ప్రజలకు చిన్నపాటి ఇబ్బంది ఎదురైనా తక్షణమే స్పందించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.గురువారం తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల అధికారులతో ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వర్షాల తీవ్రత, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, రహదారుల పరిస్థితి, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.లోతట్టు ప్రాంతాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళిక ఉండాలని సూచించారు.వర్షాలు, ఈదురుగాలులకు చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత శాఖలు సమన్వయంతో వెంటనే స్పందించాలన్నారు. రహదారులపై కూలిన చెట్లు, ఇతర అడ్డంకులను యుద్ధప్రాతిపదికన తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో మరమ్మతులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణే కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిస్థితిపై అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని, చిన్న సమస్యను సైతం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి ప్రజల్లో భరోసా కల్పించాలని సూచించారు.ప్రజలు కూడా వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు.
తణుకు రిపోర్టర్ అను కుమార్