అనంతపురం రైల్వే పోలీసుల సమయస్ఫూర్తి: తప్పిపోయిన మానసిక వికలాంగ బాలుడి సురక్షిత అప్పగింత
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :
ఇంటి నుంచి తప్పిపోయి ఆందోళనలో ఉన్న ఒక మానసిక వికలాంగ బాలుడిని అనంతపురం ప్రభుత్వ రైల్వే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సమీర్ బేగ్ (16) అనే బాలుడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆదివారం (నవంబర్ 01) రాత్రి 8:00 గంటల ప్రాంతంలో అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా తిరుగుతుండగా, డ్యూటీలో ఉన్న రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దామోదర్ గమనించారు. బాలుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని సురక్షితంగా ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అనంతరం, రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశులు బాలుడికి ధైర్యం చెప్పి ఆరా తీయగా, ఆదోనికి చెందినవాడిగా గుర్తించారు. వెంటనే ఆదోనిలోని బాలుడి తల్లిదండ్రులైన హూర్బానీ, శాలం బేగ్‌లకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని అనంతపురం చేరుకున్న తల్లిదండ్రులకు ఎస్‌ఐ వెంకటేసులు సమక్షంలో బాలుడిని భద్రంగా అప్పగించారు.
నాలుగు రోజులుగా నరకయాతన అనుభవించిన తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించిన హెడ్ కానిస్టేబుల్ దామోదర్, ఎస్‌ఐ K. వెంకటేసులుతో పాటు అనంతపురం రైల్వే పోలీసులకు తల్లిదండ్రులు కంటతడి పెడుతూ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సమయస్ఫూర్తిని స్థానికులు, రైల్వే ప్రయాణికులు ప్రశంసించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్