ఆంధ్ర క్రికెట్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్ల విజేత మణికంఠకు ‘సిరమ్మ’ అభినందనలు
విజయనగరం టౌన్, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు సాధించి ప్రతిభ చాటిన విజయనగరం క్రీడాకారుడు కే. బాల మణికంఠను తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ ప్రత్యేకంగా అభినందించారు.
గత జూలై 11న విశాఖపట్నం వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని చిన్ని, సెక్రటరీ సానా సతీష్ కుమార్, గేమ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎమ్‌ఎస్ కుమార్ ల ఆధ్వర్యంలో ఈ జిల్లా స్థాయి మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. విజయనగరం పట్టణ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ సీతారామరాజు, ట్రెజరర్ వర్మ, సెలెక్టర్ సర్ఫరాజ్ ల సారథ్యంలో విజయనగరం జిల్లా తరఫున ప్రతినిధ్యం వహించిన తోటపాలెం నివాసి కే. బాల మణికంఠ ఏకంగా 17 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో సోమవారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, టీడీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మను మణికంఠ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మణికంఠకు ‘క్రికెట్ గిఫ్ట్ బాక్స్’ ను బహుమతిగా అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ — "జిల్లా స్థాయి పోటీల్లో అత్యధిక వికెట్లు సాధించి విజయనగరం పేరు నిలబెట్టడం మన పట్టణానికి గర్వకారణం. మణికంఠ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలి" అని ఆకాంక్షించారు. అలాగే యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ ప్రతినిధులు కేశినేని చిన్ని, సానా సతీష్ కుమార్, ఎమ్‌ఎస్ కుమార్ లను కూడా ఆమె కొనియాడారు.