అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
- పామూరులో ఎస్సై అనూక్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
- విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు ఘన నివాళి
పామూరు, మేజర్ న్యూస్ : ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పామూరు ఎస్సై అనూక్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఎస్సై అనూక్ నేతృత్వంలో పామూరు పట్టణంలో పోలీసు సిబ్బంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ క్యాండిల్స్ చేతబట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి సేవలు, త్యాగాలను గుర్తుచేసేలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి అమరులైన పోలీసుల సేవలను సమాజం ఎప్పటికీ మరువదని ఎస్సై పేర్కొన్నారు. కార్యక్రమంలో పామూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.