అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రశంసలు
మదనపల్లె,మేజర్ న్యూస్ : సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ప్రాణ,ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పేర్కొన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మదనపల్లెలోని బీటీ కళాశాల పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని,దేశవ్యాప్తంగా అమరులైన 154 మంది,జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన 9 మంది పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ స్మృతి పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ యు.రంగనాథ్ బాబు వ్యవహరించారు.
త్యాగాలకు ప్రతీక అక్టోబర్ 21
కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిలో పదిమంది సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని,వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ రోజును పోలీసు అమరవీరుల దినోత్సవంగా పాటిస్తున్నామని తెలిపారు.ప్రతిక్షణం సవాళ్లను ఎదుర్కొంటూ,నిస్వార్థంగా సేవలందిస్తున్న పోలీసులకు సమాజం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలన్నారు.అన్నమయ్య జిల్లా పోలీసులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని,భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ధైర్యమే పోలీసుల ఆయుధం
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మాట్లాడుతూ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు,భయం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం ఇది పోలీసులకు మాత్రమే సాధ్యమన్నారు.మాతృభూమి రక్షణలో అమరులైన జవాన్ల ధైర్యం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు.ఉగ్రవాదులు,నక్సలైట్లు,నేరస్థులతో పోరాడుతూ ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు.కోవిడ్ లాంటి విపత్కర సమయంలోనూ ధైర్యంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు.అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వారికి ఎలాంటి కష్టమొచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ భరోసానిచ్చారు.ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అమరులైన 154 మంది పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి చదివి వినిపించారు.అనంతరం పరేడ్ మైదానం నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు.సాయుధ బలగాలు,స్థానిక ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు,విద్యార్థినీ విద్యార్థులు ఇతర అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆసరా
కార్యక్రమం ముగింపులో,జిల్లాలో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు అధికారులు నగదు బహుమతులు అందజేశారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్,అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు యు.రంగనాథ్ బాబు,కె.సురేష్ కుమార్ రెడ్డి,ఇతర అధికారులు,పోలీసు సిబ్బంది,మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి