|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:35 PM
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఓ వైపు గ్రామాభివృద్ధికి యువత ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తుంటే.. మరోవైపు జీవితానుభవం ఉన్న వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వృద్ధులు నామినేషన్లు వేయగా... మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం అత్యంత ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి అయిన రామచంద్రారెడ్డి, 95 ఏళ్ల వయసులో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన పుట్టి పెరిగిన సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. వయసును ఏమాత్రం లెక్క చేయకుండా రామచంద్రా రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ.. వారితో సరదాగా ముచ్చటిస్తూ, తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తన శేష జీవితాన్ని గ్రామాభివృద్ధికి అంకితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 95 ఏళ్లుగా నాగారం గ్రామాన్ని దగ్గరుండి చూస్తున్నానని.. గ్రామానికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు తన విజయానికి కృషి చేయాలని కోరుతున్నారు. కాగా, ఆయనకున్న అపార అనుభవం, గ్రామంపై ఉన్న పట్టు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన కుమారుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం చురుకుగా పాల్గొంటున్నారు. తండ్రికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించడం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాకుండా.. రామచంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఈ వయసులో కూడా గ్రామం కోసం ఆయన చూపిస్తున్న నిబద్ధతను కొందరు ప్రశంసిస్తుంటే, మరోవైపు యువతకు అవకాశం ఇవ్వొచ్చు కదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాలు, అధికారం కుటుంబాలకే పరిమితం అవుతున్నాయనే చర్చకు ఈ నామినేషన్ దారి తీసింది.