|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:59 PM
22ఏ జాబితా.. దీని గురించి సామాన్యులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. భూముల క్రయవిక్రయాలు జరిపేవారికి 22ఏ జాబితా గురించి బాగా తెలుసు. ప్రభుత్వ నిషేధిత భూములు ఈ జాబితాలో ఉంటాయి. ఒక్కసారి భూములు ఈ జాబితాలో చేరితే వాటిని అమ్మడం, కొనడం చేయలేము. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 1800 ఎకరాల భూమిని నిషేధిత జాబితా(22ఏ)లో చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలంలో ఉన్న గోపన్‌పల్లి రెవెన్యూ గ్రామంలోని 1,800 ఎకరాల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితా (22ఏ)లోకి చేర్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచే ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఈ గ్రామంలో గల భూమిలోని దాదాపు 3వ వంతు భూమిని.. నిషేధిత జాబితాలోకి చేర్చడం సంచలనంగా మారింది.
గత 20 సంవత్సరాలుగా.. ఇక్కడ వెలిసిన కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న భూమి కూడా ఈ జాబితాలో చేరడంతో వీటి యజమానులు, ఈ భూముల మీద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా అధికారులు.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు లేఖ రాసి.. గోపల్‌పల్లిలోని 18 సర్వే నంబర్లను 22ఏ జాబితాలో చేర్చాలని కోరారు. దీంతో, ఆ భూముల్లో లావాదేవీలను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఐజీఆర్‌ఎస్ పోర్టల్‌లో ఈ జాబితాను పొందుపరిచారు. ఈ భూముల విలువ సుమారు 27 వేల కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు.
ఈ నిషేధిత సర్వే నంబర్లలో చేర్చిన భూముల్లో వందలాది ఐటీ కంపెనీలు, ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలతో పాటుగా అనేక ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వం పలు ఉద్యోగ శాఖలు, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూములు ఈ నిషేధిత జాబితాలో చేర్చడం గందరగోళంగా మారింది.
గోపన్‌పల్లిలోని 18 వేర్వేరు సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. రెవెన్యూ రికార్డులలో వీటిని ప్రభుత్వ స్థలంగా పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంతో పాటు దేవాదాయ శాఖ, లావాణి పట్టాలు కూడా ఉన్నాయి. రెండు రోజుల క్రితమే శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ జాబితా చేరింది. దీంతో ఈ సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్లు సబ్ రిజిస్ట్రార్ తెలిపారు.
గోపన్‌పల్లి రెవెన్యూ గ్రామం.. ఐటీ కారిడార్‌లో భాగంగా ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే టీసీఎస్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పైగా ఈ గ్రామం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్‌కు సమీపంలో ఉండటంతో ఇక్కడ భూముల విలువ విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో సగటున ఎకరం ధర రూ.150 కోట్లు అనుకుంటే... మొత్తం 1,800 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.27 వేల కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్నారు.