|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 08:32 PM
నగర ప్రజలకు.. ముఖ్యంగా పోస్టల్ సేవలను తరచుగా ఉపయోగించే వారికి శుభవార్త. తపాలా కార్యాలయాల ద్వారా అత్యవసరంగా తపాలా పంపవలసిన వారికి ఉపశమనం కలిగేలా.. హైదరాబాద్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జీపీఓలో స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం 24x7 నైట్ షిఫ్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలు ప్రారంభం..
సాధారణంగా తపాలా కార్యాలయాలు సాయంత్రం వేళల్లో మూసివేస్తారు. దీంతో రాత్రిపూట లేదా పొద్దున త్వరగా అత్యవసర ఉత్తరాలు పంపాల్సిన వారికి సమస్యలు ఎదురయ్యేవి. ఈ విసుగుకు చెక్ పెడుతూ.. హైదరాబాద్ జీపీఓ నిరంతరాయంగా సేవలు అందించాలని నిర్ణయించింది.
ఇకపై స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ అదనపు సౌకర్యం వల్ల కస్టమర్లు పగటి వేళలో కౌంటర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
ఈ నైట్ షిఫ్ట్ బుకింగ్ ద్వారా.. రాత్రి సమయంలో బుక్ చేసిన తపాలా కూడా నిరంతరాయంగా రవాణాకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా వాణిజ్య సంస్థలకు , డాక్యుమెంట్లు అత్యవసరంగా పంపాల్సిన వారికి ఇది పెద్ద ఉపశమనం.
హైదరాబాద్ జీపీఓ..
తపాలా సేవల్లో వేగం, భద్రత ముఖ్యమైన అంశాలు. హైదరాబాద్ జీపీఓ ఎప్పుడూ ప్రధాన పోస్టల్ కేంద్రంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకుముందు జీపీఓలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే బుకింగ్ సేవలు అందుబాటులో ఉండేవి. ఈ సమయంలో రిజిస్టర్డ్ పోస్ట్ పార్సిల్ సేవలు , మనీ ఆర్డర్లు , ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు వంటివి అందించేవారు. కొన్ని ప్రత్యేక కౌంటర్లు మాత్రమే కొద్దిసేపు అదనంగా పనిచేసేవి.
ఇప్పుడు 24x7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ ద్వారా.. పోస్టల్ శాఖ ప్రజల అవసరాలకు మరింత చేరువవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మార్పు తపాలా వ్యవస్థలో ఆధునికీకరణ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఇది ముఖ్యంగా తెలంగాణ రాజధానిలో.. దేశంలోని ఇతర నగరాలు, అంతర్జాతీయ గమ్యస్థానాలకు త్వరితగతిన కార్యకలాపాలు నిర్వహించడానికి సహాయపడుతుంది. పోస్టల్ అధికారులు ఈ కొత్త నైట్ షిఫ్ట్ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.