|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 02:18 PM
పాతబస్తీలోని యాకుత్‌పురా డివిజన్ మౌలాకా చిల్లాలోని మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. కాని ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఇందుకు గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. బాధ్యులు ఎవరనేదానిపై ప్రాథమికంగా వెంటనే దర్యాప్తు చేసింది. ఈమేరకు బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం చిన్నారి పడిపోయిన వరకు.. అక్కడి సీసీటీవీ ఫుటేజీను తెప్పించుకుని పరిశీలిస్తోంది. అలాగే స్థానికంగా పని చేస్తున్న హైడ్రా, జలమండలి, జీహెచ్ ఎంసీ విభాగాలతో శుక్రవారం సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు.. స్థానిక కార్పొరేటర్ ఆదేశాలమేరకు.. అక్కడ మ్యాన్‌హోల్‌ను తెరచి మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టింది. కొన్నేళ్లుగా మట్టి పేరుకుపోవడంతో గట్టిగా మారి తొలగించడానికి వీలు లేకుండా పోయింది. జలమండలి జెట్టింగ్ మెషిన్లతో తొలగించాలని నిర్ణయించారు. ఆ వెంటనే జలమండలి జెట్టింగ్ మెషిన్ వచ్చి శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. వేరే మ్యాన్ హోల్ శుభ్రం చేసే పనిని స్థానిక కార్పొరేటర్ సూచించడంతో హైడ్రా మెట్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్‌హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్టు ప్రాధమిక సమాచారం. బుధవారం సాయంత్రం రెండో షిఫ్టు మెట్ సిబ్బంది గమనించి మూత వేయడానికి ప్రయత్నించగా.. ఇంకా పని కాలేదు..తెరిచే ఉంచాలని స్థానికంగా ఉన్న వాళ్లు అడ్డుకోవడంతో మూత వేయకుండానే వెళ్లిపోయారు. గురువారం ఉదయం పాఠశాల సమయంలో ఓ చిన్నారి అందులో పడిపోవడం.. ఆ చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లే తల్లి చూసి పాపను కాపాడారు. తల్లి అప్రమత్తతతో చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఆ వెంటనే స్థానికులు కూడా స్పందించడం పట్ల హైడ్రా ఎంతో ఊరట చెందింది. 9000113667 నంబరుకు సమాచారం ఇవ్వండి..
వర్షాకాలం వరద పోయేందుకు వీలుగా మ్యాన్‌హోళ్ల మూతలు తెరవడం.. వరద తగ్గగానే వాటిని తిరిగి మూత వేయడం జరుగుతోంది. మ్యాన్‌హోల్ మూత తెరచి ఉన్నంత వరకు అక్కడే మెట్ సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు హైడ్రా తీసుకుంది. ఒక వేళ ఎక్కడైనా పొరపాటున మ్యాన్ హోల్ మూత తెరచి ఉంటే.. ఆ సమాచారాన్ని 9000113667 నంబరుకు ఫోను ద్వారా తెలియజేయాలని హైడ్రా ఒక ప్రకటనలో కోరింది.