|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 06:54 PM
పటాన్చెరు : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని రహదారికి ఇరువైపులా ఉన్న మహనీయుల విగ్రహాలను సాకి చెరువు కట్ట పైన ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి జాతీయ రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ మూలంగా రామచంద్రపురం తో పాటు పటాన్చెరు డివిజన్ పరిధిలోని రహదారి సమీపంలో గల మహనీయుల విగ్రహాలు వేరే చోటికి తరలించాల్సి వస్తుందని తెలిపారు. ప్రధానంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మహాత్మా బసవేశ్వరుడి విగ్రహం, ప్రజా గాయకుడు గద్దర్, స్వామి వివేకానంద, కొండ లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ అమరవీరుల స్థూపం, చాకలి ఐలమ్మ, రాణా ప్రతాప్, సర్వాయి పాపన్న, చత్రపతి శివాజీ విగ్రహాలను సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ విగ్రహాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్రిశాట్ పక్కన, చాచా నెహ్రు విగ్రహాన్ని ఐబి సమీపంలోకి తరలించనున్నట్లు తెలిపారు. రహదారి విస్తరణలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణ పాల్గొన్నారు.