|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 06:37 AM
ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, భాగ్యనగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పాతికేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. నగరంలో అండర్ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థలపై దృష్టి సారించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు వారసత్వ కట్టడాలను రక్షించి, పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.పాతబస్తీ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కోర్ సిటీలోని కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని అధికారులకు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ముఖ్యమంత్రి అన్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.మంచినీరు, మురుగు నీరు వ్యవస్థలను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మూసీపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీకి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూపార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో హోటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు.