|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 07:53 PM
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగానికి కొత్త కళను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లాలో ఎకో టూరిజం , టెంపుల్ టూరిజంలను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డిలతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు కీలక పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై చర్చించారు.
అభివృద్ధి చేయదగిన ప్రదేశాలు వివరాల్లోకి వెళ్తే.. పాలేరు రిజర్వాయర్ పరిధిలో.. జల క్రీడలు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు.. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం వద్దు.. చారిత్రక ప్రాధాన్యతను చాటేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ఇక వీటితో పాటు.. పర్ణశాల, భద్రాచలం రామాలయం ఆధ్వర్యంలో.. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం... కిన్నెరసాని ప్రాజెక్టు పరిధిలో.. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా అభివృద్ధి చేయడం.. కొత్తగూడెం హరిత హోటల్ పరిధిలో.. పర్యాటకులకు బస సౌకర్యాలు కల్పించడం.
ఈ ప్రదేశాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అనువైన వాతావరణం, ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయంను మరింత అభివృద్ధి పరచి, భక్తులకు అత్యుత్తమ వసతులు కల్పించాలని మంత్రులు స్పష్టం చేశారు. అందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేదా ప్రైవేట్ భాగస్వామ్యంతో వెంటనే మంజూరు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, ఈ పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున, తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఖమ్మం పట్టణానికి సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రదేశంలో ఏకో టూరిజం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం పట్టణంలో కొత్త హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కొత్తగూడెంలో ఉన్న హరిత హోటల్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.