|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 01:48 PM
పటాన్చెరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గంలో ఈనెల 29వ తేదీన పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ అంశంపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వరూప, ఆయా మండలాల తహసిల్దారులు, రేషన్ డీలర్ల ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల, జిన్నారం, అమీన్పూర్, పటాన్చెరు, రామచంద్రపురం రెవెన్యూ మండలాల పరిధిలో నూతన రేషన్ కార్డుల కోసం 9414 దరఖాస్తులు రాగా.. అర్హులైన 2096 దరఖాస్తులు ఆమోదించినట్లు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా 74,214 రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్లను ఆదేశించారు. నూతన రేషన్ కార్డులు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు సమావేశానికి హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులందరూ హాజరయ్యేలా ఆయా మండలాల తహసిల్దార్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, ఆయా మండలాల తహసిల్దార్లు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, తదితరులు పాల్గొన్నారు.