ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలి, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను వెంటనే తొలగించాలి, ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,
జిల్లాలో ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…….. రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సరిపోదని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. పోలీస్, రవాణా, రోడ్లు మరియు భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలు, వేగ నియంత్రణ ఏర్పాట్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా రహదారులపై తగిన వెలుతురు, స్పష్టమైన హెచ్చరిక సూచికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం, వాహనాలను నిలిపి ఉంచడం వల్ల పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి ఆక్రమణల వల్ల ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉన్న రహదారిపై ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని, పట్టణంలోని ఇతర ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను కూడా తొలగించి పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకంపై ప్రజలకు విస్తృతంగాఅవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాద బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించేందుకు ప్రజలు ముందుకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఈ విషయంలో పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందేలా చూడాలని ఆదేశించారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. చేపట్టిన చర్యల అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోడ్డు భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పి.విజయ్ కుమార్, నాగర్‌కర్నూల్ ప్రతినిధి, సూర్య న్యూస్