భగవంతుడు అందరికీ ఒక్కడే
*డీసీసీ జనరల్ సెక్రటరీ వరాల సిరాజుద్దీన్
మోమిన్‌పేట్, సెప్టెంబర్ 21 (సూర్య ప్రతినిధి):
"భగవంతుడు అందరికీ ఒక్కడేనని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని" డీసీసీ జనరల్ సెక్రటరీ వరాల సిరాజుద్దీన్ అన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని చంద్రన్‌పల్లి గ్రామంలోని హనుమాన్ మందిర్ వద్ద వెలసిన విఘ్నేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు.
గ్రామస్తులు, స్థానిక నాయకులతో కలిసి విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద వరాల సిరాజుద్దీన్ సౌజన్యంతో, గ్రామ పంచాయతీ సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో భక్తులకు కులమతాలకు అతీతంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మత సామరస్యాన్ని చాటుతూ అందరికీ అన్నదానం బహుకరించడం పట్ల గ్రామస్తులు, గ్రామ పెద్దలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ సిరాజుద్దీన్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వెంకట్, నాయకులు మల్లయ్య, ప్రభాకర్ రెడ్డి, నర్సింలు, ఏజాస్ పటేల్, అఫ్సర్, హాజీ, హాశం, తాజ్, వార్డు సభ్యులు, చంద్రన్‌పల్లి గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు విశేషంగా పాల్గొన్నారు.