48 ఏళ్లుగా మంచినీళ్లే ముట్టలేదన్న వారెన్ బఫెట్.. బిలియనీర్ ఆశ్చర్యకరమైన డైట్ గుట్టు విప్పిన బిల్ అక్‌మన్!
సూర్య ఇంటర్నేషనల్ బిజినెస్ బ్యూరో, న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాథ్‌వే అధినేత వారెన్ బఫెట్ జీవనశైలి, విచిత్రమైన ఆహారపు అలవాట్లపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఏకంగా 48 ఏళ్లుగా ఒక్క చుక్క మంచి నీటిని కూడా తాగలేదని వారెన్ బఫెట్ స్వయంగా తనతో చెప్పినట్లు ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్, పెర్షింగ్ స్క్వేర్ సీఈవో బిల్ అక్‌మన్ వెల్లడించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్‌మన్.. బఫెట్‌తో కలిసి డిన్నర్ చేసినప్పటి పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ఈ విషయాన్ని బయటపెట్టారు.
బిల్ అక్‌మన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం ఆయన తన ఇంట్లో బఫెట్‌కు విందు ఏర్పాటు చేశారు. బఫెట్‌కు చెర్రీ కోక్ అంటే ఎంత ఇష్టమో తెలిసిన అక్‌మన్, ఆయన కోసం ప్రత్యేకంగా దాన్ని తెప్పించి భద్రపరిచారు. డైనింగ్ టేబుల్ వద్ద భోజన సమయంలో "సాధారణ నీళ్లు తీసుకుంటారా లేదా స్పార్క్లింగ్ వాటర్ కావాలా?" అని అక్‌మన్ అడగ్గా, బఫెట్ ఆ రెండింటినీ సున్నితంగా తిరస్కరించి కోక్ మాత్రమే కోరారు. "అసలు మీరు రోజూ మంచినీళ్లు తాగరా?" అని ఆశ్చర్యంతో అడగ్గా.. "బిల్, నేను మంచినీళ్లు తాగి ఇప్పటికి 48 ఏళ్లు అవుతోంది" అని బఫెట్ సమాధానమిచ్చినట్లు అక్‌మన్ గుర్తు చేసుకున్నారు.
వారెన్ బఫెట్ ఆహారపు అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందాయి. 90 ఏళ్లు దాటిన వయసులోనూ ఆయన రోజూ కనీసం ఐదు క్యాన్ల కోకాకోలా తాగుతారని, తన శరీరంలో నాలుగో వంతు కోలాతోనే నిండి ఉందని గతంలో సరదాగా వ్యాఖ్యానించారు. మెక్‌డొనాల్డ్స్ బ్రేక్‌ఫాస్ట్, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు ఆయన రోజువారీ ఆహారంలో భాగం. ఆధునిక ఫిట్‌నెస్, హెల్త్ డైట్‌లను ఏమాత్రం పట్టించుకోకుండా, 6 ఏళ్ల చిన్నపిల్లాడిలా ఇష్టమైన జంక్ ఫుడ్‌ను ఆస్వాదిస్తూనే దశాబ్దాలుగా ఎంతో చురుగ్గా పనిచేస్తున్న బఫెట్ ఆహారపు అలవాట్లు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.