టెస్లా సరికొత్త ఎగిరే కారుకు ఫ్లోరిడాలో అనుమతిస్తాం: గవర్నర్ రాన్ డిసాంటిస్ సంచలన ప్రకటన!
సూర్య ఇంటర్నేషనల్ & ఆటో డెస్క్, తల్లహస్సీ (ఫ్లోరిడా): ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ఆవిష్కరించిన వినూత్న “ఫ్లయింగ్ రోడ్‌స్టర్” కారుకు సంబంధించి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డిసాంటిస్ కీలక హామీ ఇచ్చారు. గాల్లోకి ఎగిరే ఈ ఆధునిక కారు తమ రాష్ట్రంలో తిరిగేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన అనుమతులు కల్పిస్తామని, దీన్ని రోడ్ లీగల్ (Road Legal) చేసేందుకు స్వయంగా చొరవ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
టెక్సాస్‌లో టెస్లా రోడ్‌స్టర్ ఎగిరే విన్యాసం:
టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ కేంద్రంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో టెస్లా సరికొత్త రోడ్‌స్టర్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇందులో ప్రత్యేకంగా అమర్చిన సంపీడన గాలి రాకెట్ థ్రస్టర్లసాయంతో కారు కాసేపు గాల్లోకి లేచి, 180 డిగ్రీలు తిరిగి మళ్లీ చక్రాలపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. సాధారణ కార్లలా రోడ్లపై పరుగెత్తడంతో పాటు గాల్లోకి దూసుకుపోయేలా రూపొందించిన ఈ వాహనం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
"మా రాష్ట్రంలో చట్టబద్ధం చేస్తాం" – రాన్ డిసాంటిస్:
ఈ సరికొత్త కారు రోడ్లపై తిరగడానికి భద్రతా పరమైన అనుమతులు లభిస్తాయా లేదా అన్నదానిపై ఆటో నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ రాన్ డిసాంటిస్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించారు. "దీన్ని మా రాష్ట్రంలో చట్టబద్ధం చేసేలా మేము తప్పక చూస్తాం" అని పేర్కొంటూనే, "కనీసం ది విలేజెస్ పరిసరాల్లో గోల్ఫ్ కార్ట్‌లను దాటుకుని గాల్లోకి దూసుకెళ్లేందుకైనా ఇది ఉపయోగపడుతుంది" అని చమత్కరించారు.
నిబంధనలు – సవాళ్లు:
ఫ్లోరిడా రాష్ట్ర పరిధిలో వాహన రిజిస్ట్రేషన్, రోడ్డు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తున్నప్పటికీ, విమానయాన, వాయుమార్గ నిబంధనలను యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నియంత్రిస్తాయి. అందువల్ల ఒక కారు గాల్లోకి ఎగరడానికి ఫెడరల్ అనుమతులు, పైలట్ లైసెన్స్ నిబంధనలు, ఇన్సూరెన్స్ విధానాలు తప్పనిసరి అవుతాయి. అయితే, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఫ్లోరిడా ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని డిసాంటిస్ ఇచ్చిన భరోసా టెస్లా అభిమానులను, మదుపర్లను ఉత్సాహపరిచింది.