మాస్ ప్రేక్షకులకు సీతన్నపేట గేట్ నచ్చుతుంది.. డిసెంబర్ 4న విడుదల: వేణు గోపాల్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వేణు గోపాల్ ప్రధాన పాత్రలో నటించిన సీతన్నపేట గేట్ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైఎంఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై వైఎంఆర్ నిర్మించిన ఈ చిత్రానికి వై. రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాం రెడ్డి, పార్థు, 8 పీఎం సాయి కుమార్, సుధీక్షజ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు దర్శకుడు వి. సముద్ర, నటుడు విజయ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన దర్శకుడు వి. సముద్ర, నిర్మాత వైఎంఆర్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించారని ప్రశంసించారు. ప్రతి పాత్ర భిన్నంగా, వైల్డ్‌గా ఉంటుందని, డిసెంబర్ 4న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్త ట్విస్టులు, యదార్థ సంఘటనల ఆధారంగా కథను తీర్చిదిద్దామని, ఇంటర్వెల్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు.
హీరో వేణు గోపాల్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో సినీ రంగంలోకి పరిచయం అవుతున్నానని, అనేక సవాళ్లు అధిగమించి సినిమాను పూర్తిచేశామని చెప్పారు. మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు సీతన్నపేట గేట్ తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ప్రాజెక్టుతోనే ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆశిస్తున్నట్లు నిర్మాత వైఎంఆర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న విజయ రామరాజు, బాబు, రవి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి సినిమాతోనే ఏడు భాషల్లో విడుదలయ్యే అవకాశం దక్కడం విశేషమని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు.